Srikakulam District: ఫణి పెనుముప్పు నుంచి బయటపడిన శ్రీకాకుళం జిల్లా: కలెక్టర్‌ ప్రకటన

  • వరద ప్రభావం మాత్రం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • ఆర్టీజీఎస్‌ సూచించిన విధంగానే సాగిన తుపాన్‌ గమ్యం
  • గాలుల వేగం, వర్షపాతం అంచనాలు తప్పలేదు

శ్రీకాకుళం వాసుల్ని వణికించిన ఫణి తుపాన్‌ ప్రభావం నుంచి జిల్లా బయట పడిందని, జిల్లాకు దూరంగా తుపాన్ తీరం దాటడంతో పెనుముప్పు తప్పినట్టేనని ఆ జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసినందున నదులు, వాగులకు వరద ప్రమాదం ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురువారం రాత్రంతా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూంలోనే ఉండి పరిస్థితిని గమనించిన కలెక్టర్‌ ఈరోజు ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్‌టీజీఎస్‌ హెచ్చరించిన విధంగానే తుపాన్‌ గమనం సాగిందని చెప్పారు. తీరప్రాంత మండలాలపై తుపాన్ కొంత ప్రభావం చూపిందని చెప్పారు. ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మూడు గుడిసెలు, పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలినట్లు సమాచారం అందిందని చెప్పారు. విద్యుత్‌ స్తంభాల తక్షణ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కంచిలి మండలంలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. సెల్‌ కంపెనీల  టవర్లను అనుసంధానం చేయించి ఒక కంపెనీ టవర్‌ దెబ్బతిన్నా, మరో దాన్నుంచి సిగ్నల్స్‌ అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమాచార వ్యవస్థలో ఎటువంటి అంతరాయం తలెత్తలేదని స్పష్టం చేశారు.

తీరం సమీపంలో ఉన్న గ్రామాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. తుపాన్ తీరం దాటక ముందు, తర్వాత భారీ వర్షాలు కురిసిన కారణంగా వంశధార, బాహుద నదుల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

Srikakulam District
District Collector
pani cyclone
  • Loading...

More Telugu News