Srikakulam District: మధ్యాహ్నానికి తీరం దాటనున్న తుపాను.. శ్రీకాకుళంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • గోపాల్‌పూర్-చాంద్‌బీ మధ్య తీరం దాటనున్న తుపాను
  • శ్రీకాకుళానికి పెను ముప్పు
  • బలహీనపడి బంగ్లాదేశ్‌వైపు

సూపర్ సైక్లోన్‌గా మారిన ఫణి తుపాను ఒడిశా దిశగా పయనిస్తోంది. ఈ మధ్యాహ్నానికి తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. శ్రీకాకుళం తీరం మీదుగా పయనించి ఒడిశాలోని గోపాల్‌పూర్-చాంద్‌బీ మధ్య తీరం దాటనుందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు పెను ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో గంటకు 170 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి క్రమంగా బలపడుతుందన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చేరుకునే సరికే తుపాను బలహీన పడి అటునుంచి రేపు (శనివారం) బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని అధికారులు వివరించారు.

తుపాను ప్రభావంతో రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయనగరంలోనూ ‘ఫణి’ ప్రభావం కనిపిస్తోంది. తీరంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. వేలాదిమందిని ఇప్పటికే సహాయక శిబిరాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్‌ను నిలిపేయడంతో జిల్లా అంధకారంలో చిక్కుకుంది. ఈదురు గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇక ఈస్ట్‌కోస్ట్ రైల్వే 107 రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారి మళ్లించింది.  

  • Loading...

More Telugu News