Secunderabad: ఫిలింనగర్ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి ఏపీ కానిస్టేబుల్.. అరెస్ట్!
- సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడి గుర్తింపు
- ఏపీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అని తేల్చిన పోలీసులు
- ఓ ప్రముఖుడి వద్ద పని చేస్తున్న శ్రీనివాస్
- విధులు ముగించుకుని వెళ్లే క్రమంలో కాల్పులు
సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే సిటీ బస్సులో నేటి ఉదయం 11 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపి, ఓ వ్యక్తి పరారైన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి ఎవరనేది పోలీసు అధికారులు గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ ఆర్. శ్రీనివాస్ బస్సులో కాల్పులకు తెగబడినట్టు సీసీ టీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖుడి వద్ద విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ నేటి ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిటీ బస్ ఎక్కాడు.
ఈ క్రమంలో బస్సు కొద్ది దూరం వెళ్లగానే తోటి ప్రయాణికుడితో వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీనివాస్ ఆగ్రహంతో తన వద్దనున్న తుపాకీ తీసి బెదిరించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరపడంతో బస్సు పై భాగంలో తూటా తగిలింది. అయితే శ్రీనివాస్‌కు అంతగా ఆగ్రహం కలిగించేందుకు దారి తీసిన పరిస్థితులు, శ్రీనివాస్‌కు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీసులు శ్రీనివాస్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు అందించారని తెలిపారు. అయితే జనం మధ్య కాల్పులు జరపడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు ఠాకూర్ తెలిపారు.