phoni: ‘ఫణి’ ప్రభావంపై ఆర్టీజీఎస్ ద్వారా అనుక్షణం సమీక్షిస్తున్నాం: సీఎం చంద్రబాబు
- తుపాన్ తీరం దాటే సమయంలో తీవ్ర ప్రభావం
- ఈరోజు, రేపు ‘రెడ్ అలర్ట్’ కొనసాగుతుంది
- యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం
బంగాళాఖాతంలో అతితీవ్ర తుపానుగా మారిన ‘ఫణి’ ప్రభావంపై ఆర్టీజీఎస్ ద్వారా అనుక్షణం సమీక్షిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళంలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 200 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైన ‘ఫణి’ గంటకు 19 కి.మీ వేగంతో పయనిస్తోందని, ఈరోజు, రేపు ఈ ‘రెడ్ అలర్ట్’ కొనసాగుతుందని అన్నారు. విజయనగరం తీర ప్రాంత మండలాల్లో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేపు ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీ వద్ద ‘ఫణి’ తుపాను తీరం దాటనుందని, దీని వల్ల ఈ రోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని, దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్ ద్వారా అప్రమత్తం చేసినట్టు తెలిపారు.