Telangana: కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో పొగలు.. కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d7ee84f379c15511089ccee51d1d8010cc0e0c29.jpg)
- కరీంనగర్ లోని మంగపేట వద్ద ఘటన
- వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా పొగలు
- అప్రమత్తమై ప్రయాణికులు దిగిపోవాలని డ్రైవర్ సూచన
తెలంగాణలోని కరీంనగర్ లో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అనంతరం అందరూ దిగిపోవాలని కోరాడు. దీంతో పలువురు ప్రయాణికులు వేగంగా బయటపడ్డారు. వరంగల్ నుంచి నిజామాబాద్ కు సర్వీస్ నంబర్ 7623 ఉన్న బస్సు ఈరోజు బయలుదేరింది.
అయితే కరీంనగర్ డిపోను దాటి మంగపేట శివారు వద్దకు రాగానే వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం ప్రారంభమయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను వాహనం నుంచి దిగిపోవాలని కోరాడు. దీంతో భయపడ్డ ప్రయాణికులు కొందరు కిటికీల నుంచి దూకేశారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి.
అనంతరం ప్రయాణికులను మరో బస్సులో ఆర్టీసీ అధికారులు గమ్యానికి తరలించారు. కాగా, కరీంనగర్ బస్టాండ్ లోనే బస్సులో పొగలు వచ్చాయనీ, ఈ విషయం డ్రైవర్ కు చెప్పినా పట్టించుకోలేదని కొందరు వాపోయారు. అయితే ఈ వాదనను ఆర్టీసీ సిబ్బంది ఖండించారు.