OC Singh: ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ల పేలుడు.. ఐదుగురి మృతి!
- షార్ట్ సర్క్యూట్ సమయంలో గాఢ నిద్రలో కుటుంబం
- కార్బన్ మోనాక్సైడ్ కారణంగా స్పృహ కోల్పోయారు
- పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాల తరలింపు
ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక ఇందిరానగర్ రామ్ విలాస్ కాలనీలో బుధవారం ఉదయం ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరగింది. దీంతో వారి ఇంటికి ఆనుకుని ఉన్న చిన్న గోడౌన్‌లోని గ్యాస్ సిలిండర్లు పేలాయి.
ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. సిలిండర్ల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడటంతో వారంతా స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలో ఆరు నెలల చిన్నారి సహా కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓసీ సింగ్ (60), సుమిత్ (40), జూలీ (42), వందన (36), బేబీ (6 నెలలు) ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ కారణంగా ప్రమాదం జరిగినందున ఐదు గంటల పాటు మృతదేహాలను భవనంలో నుంచి బయటకు తీసేందుకు వీలు పడలేదు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.