spy reddy: సామాజికవేత్తగా పేదల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన 'పైపుల రెడ్డి'!
- కర్నూలు జిల్లాలో ‘పైపుల రెడ్డి’గా సుపరిచితం
- బోర్లు తవ్వించి రైతుల గుండెల్లో సుస్థిర స్థానం
- రూపాయికే జొన్నరొట్టెతో పేదల కడుపు నింపిన నేత
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి గత రాత్రి మృతి చెందారు. నంద్యాల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఆయన ఎస్పీవై రెడ్డిగానే సుపరిచితులు. నంది పైపుల పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎస్పీవైని ఆ ప్రాంత వాసులు ‘పైపుల రెడ్డి’గానూ పిలుచుకుంటారు. అయితే, ఆయన అసలు పేరు మాత్రం సన్నపురెడ్డి పెద్ద ఎరుకలరెడ్డి.
ఎస్పీవై రెడ్డి రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజికవేత్తగానూ గుర్తింపు పొందారు. నంద్యాల నియోజకవర్గంలో ఉచితంగా బోర్లు వేయించి సేవాతత్పరతను చాటుకున్నారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రతి పొలంలో బోరు బావులు వేయించి, పైపులు.. మోటార్లు ఉచితంగా అందించి ఎంతోమంది రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రూపాయికే జొన్నరొట్టె, పప్పు, మజ్జిగ, రూ.3కే కొబ్బరిబొండం పంపిణీ చేసి నిరుపేదల కడుపు నింపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు అసామాన్యం.