Police: బంధువుల ఇంట్లో దాగిన హాజీపూర్ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాం: మహేశ్ భగవత్

  • శ్రీనివాస్ రెడ్డిపై కర్నూలులోనూ కేసు
  • కర్నూలులో వేశ్య హత్య కేసులో అరెస్టయ్యాడు 
  • విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం

సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యలపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో ఈ నెల 25న తన కుమార్తె అదృశ్యమైనట్టు శ్రావణి తండ్రి ఫిర్యాదు చేశారని, ఆమె ఆచూకీ కోసం ఈ నెల 27న సిట్ ఏర్పాటు చేశామని భగవత్ తెలిపారు. బాలిక కోసం షీ టీమ్స్, పోలీసులు, ఐటీ సెల్ సమన్వయంతో దర్యాప్తు చేశాయని వివరించారు.

నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన బావిలో మృతదేహాన్ని గుర్తించామని, పోస్ట్ మార్టం పరీక్షలో ఆమెపై అత్యాచారం చేసి హతమార్చినట్టు వెల్లడైందని సీపీ వెల్లడించారు. "మర్రి శ్రీనివాస్ రెడ్డిపై గతంలో కర్నూలులో కూడా కేసు నమోదైంది. 2017లో కర్నూలులో ఓ వేశ్య హత్య కేసులో శ్రీనివాస్ అరెస్టయ్యాడు. మర్రి శ్రీనివాస్ రెడ్డికి మద్యం, మాదకద్రవ్యాల అలవాటు ఉంది. శ్రావణి కేసులో భాగంగా శ్రీనివాస్ రెడ్డి ఆనుపానులపై కన్నేశాం. అతడు రావిర్యాలలోని బంధువుల ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని, అక్కడ అతడ్ని అదుపులోకి తీసుకున్నాం" అని వివరించారు.

శ్రీనివాస్ ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. 2015లో కల్పన అనే ఆరో తరగతి అమ్మాయితో మొదలు పెట్టి ఇటీవల మనీషా, శ్రావణి వరకు ఎన్నో హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News