Narayana Sai: అత్యాచారం కేసులో ఆశారాం బాపూ తనయుడికి శిక్షను ఖరారు చేసిన కోర్టు
- అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు
- యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు
- రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి
2013లో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ, ఆయన తనయుడు నారాయణ సాయి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు సూరత్‌కు చెందిన అక్కా చెల్లెళ్లు 2013లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో ఆశారాంకు జోథ్‌పూర్‌లో ఓ అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తాజాగా నేడు నారాయణసాయికి గుజరాత్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.
ఈ నెల 26న అత్యాచారం కేసులో నారాయణసాయిని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో నేడు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులు హనుమాన్ అలియాస్ కౌశల్, గంగ, జమునలకు కోర్టు పదేళ్ల చొప్పున జైలు, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా, మరో నిందితుడు రమేష్ మల్హోత్రాకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు అత్యాచార బాధితులైన అక్కా చెల్లెళ్లలో ఒకరికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.