Revanth Reddy: కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే!... ఆయన మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరినాకు టెండర్ కట్టబెట్టారు: రేవంత్ రెడ్డి
- సీజీజీ సంస్థను పక్కనబెట్టారు
- గ్లోబరినాకు పట్టం కట్టారు
- మాగ్నటిక్ ఇన్ఫో కూడా గ్లోబరినా భాగస్వామ్య సంస్థ
తెలంగాణ ఇంటర్ మార్కుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరినా సంస్థ పేరు ఎప్పుడూ వినలేదని కేటీఆర్ అనడంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలని, కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే గ్లోబరినాకు టెండర్ అప్పగించారని ఆరోపించారు. గ్లోబరినా తనకు తెలియదని కేటీఆర్ అనడం నిస్సందేహంగా ప్రజలను మోసగించడమేనని అన్నారు.
హైదరాబాద్ గాంధీభవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి, 1996లో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఎంతో కట్టుదిట్టంగా ఉండేదని చెప్పారు. ఆ సమయంలో పరీక్షల బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించారని, పరీక్షలు సాఫీగా జరిగేవని తెలిపారు. సీజీజీ ఆధ్వర్యంలో పరీక్షల ప్రకటన, ముద్రణ, ఫలితాలు వేర్వేరుగా మూడు సంస్థలకు అప్పగించేవాళ్లని, ఏనాడూ ఇబ్బంది రాలేదన్నారు.
అయితే, 2016లో సీజీజీని పక్కనబెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫో అనే సంస్థకు అన్ని బాధ్యతలు అప్పగించారని, ఎంసెట్ పత్రాలు లీకైంది అప్పుడేనంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో సీబీసీఐడీ విచారణ షురూ చేయగా, ప్రధాననిందితుల్లో ఇద్దరు అనుమానాస్పద రీతిలో చనిపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరినా కూడా మ్యాగ్నటిక్ ఇన్ఫో సంస్థకు భాగస్వామేనని అన్నారు.
మ్యాగ్నటిక్ ఇన్ఫోపై నిషేధం ఉండడంతో గ్లోబరినాకు పట్టం కట్టారనీ, ఇదంతా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని రేవంత్ ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు పిలిచారని, ఎవరిని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కంపెనీలు వేరైనా మ్యాగ్నటిక్ ఇన్ఫో, గ్లోబరినా అందరూ ఒక్కటేనని అన్నారు.