Kiran Bedi: రోజువారీ పాలనలో మీరు జోక్యం చేసుకోవడం తగదు!: కిరణ్ బేడీకి తేల్చిచెప్పిన మద్రాస్ హైకోర్టు

  • న్యాయస్థానంలో కిరణ్ బేడీకి ఎదురుదెబ్బ
  • లెఫ్టినెంట్ గవర్నర్ గా స్వతంత్రంగా వ్యవహరించడం కుదరదన్న హైకోర్టు
  • పాలన వ్యవహారాల నిర్ణయాలపై క్యాబినెట్ ను సంప్రదించాలంటూ హితవు

కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరించే వ్యక్తుల పరిధి ఏంటో మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. కిరణ్ బేడీ పుదుచ్చేరి ప్రభుత్వం రోజువారీ పాలనలో జోక్యం చేసుకోవడం కుదరదని, ఓ లెఫ్టినెంట్ గవర్నర్ గా స్వతంత్రంగా వ్యవహరించడం కూడా వీలుకాదని మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ స్పష్టం చేసింది.

రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను నిర్వచిస్తూ, స్వత్రంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చని, కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో క్యాబినెట్ ను సంప్రదించాల్సిన అవసరంలేదని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామికి, లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న కిరణ్ బేడీకి మధ్య అనేకమార్లు అధికారాలకు సంబంధించిన అంశాల్లో విభేదాలు తలెత్తాయి. దానికితోడు, కిరణ్ బేడీ ప్రయివేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై చోటుచేసుకున్న అవినీతి స్కాంలోనూ జోక్యం చేసుకుని కాలేజీల్లో ఫైళ్లను పరిశీలించారు.

అప్పటినుంచి కిరణ్ బేడీకి, పుదుచ్చేరి ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోయింది. దీనిపై ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ జరిపింది. పాలనకు సంబంధించి కిరణ్ బేడీ సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఆమె ఇలాంటి విషయాల్లో ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పింది. పుదుచ్చేరి క్యాబినెట్ ను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News