RGV: టెర్రరిస్టులు, మాఫియా తరహాలో ఏపీ పోలీసులు మాతో ప్రవర్తించారు!: నిర్మాత రాకేశ్ రెడ్డి

  • మమ్మల్ని విజయవాడలోనే ఉండొద్దన్నారు
  • కుళ్లు, కుతంత్రాలు బయటపడతాయన్న భయంతోనే
  • హైదరాబాద్ లో మీడియాతో లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పోలీసులు తమను నిర్బంధించిన తీరుపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, మాఫియా ముఠాలతో ప్రవర్తించిన తరహాలో ఏపీ పోలీసులు తమ పట్ల వ్యవహరించారని మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు నిర్బంధించారు? అని అడిగితే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకూ ‘మా పై అధికారుల ఆదేశాలు ఉన్నాయి సార్’ అని ఒకే డైలాగు చెబుతున్నారని విమర్శించారు.

అక్కడితో ఆగకుండా ‘మీరు అసలు విజయవాడలోనే ఉండకూడదు సార్’ అని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాకేశ్ రెడ్డి మాట్లాడారు. 23, 24 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలపై తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తమ కుళ్లు, కుతంత్రాలు బయటపడతాయన్న భయంతోనే కొందరు నేతలు తమను అడ్డుకుంటున్నారని చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ, తాను ఎవ్వరికీ భయపడబోమని స్పష్టం చేశారు. నిన్న విజయవాడలో ఏం జరిగిందన్న విషయం ఈరోజు ప్రపంచమంతా తెలిసిందని వ్యాఖ్యానించారు. ‘విజయవాడలో మేం హోటల్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేశారు. దీనివెనుక ఉన్న నాయకులు, ముఖ్య నాయకుల చరిత్రను బయటకు తీస్తాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఎవ్వరినీ వదిలిపెట్టబోం. తెలంగాణ ప్రజలు ఆయనకు ఇప్పటికే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రావాళ్లు రేపు తొందరలోనే ఇంకా పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు’ అని తెలిపారు.

  • Loading...

More Telugu News