Andhra Pradesh: ఆంధ్రాకు రావాలంటే మేం వీసా తీసుకోవాలా? నేరచరిత్ర లేదని ప్రూవ్ చేసుకోవాలా?: రామ్ గోపాల్ వర్మ
- ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారు
- రాష్ట్రంలో ప్రెస్మీట్ కు వీలు లేదంటున్నారు
- హైదరాబాద్ లో మీడియాతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో మీడియా సమావేశం పెట్టకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు విజయవాడలో సమావేశం పెట్టడానికి వీల్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని అర్థం. అంటే ఇది ఆంధ్రప్రదేశా? లేక నార్త్ కొరియానా? ఏపీకి రావాలంటే మేం వీసాలు తీసుకోవాలా? మాకు ఎలాంటి నేరచరిత్ర లేదని ప్రూఫ్ చేసుకుని వెళ్లాలా?’ అని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. మనదేశంలోని ఓ రాష్ట్రంలో మీడియా సమావేశం పెట్టుకునేందుకు కూడా స్వేచ్ఛ లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వచ్చే నెల 1న ఏపీలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అందరూ చూడాలని వర్మ ఈ సందర్భంగా కోరారు.