Pawan Hans: జెట్, కింగ్ ఫిషర్ దారిలోనే... ఏప్రిల్ వేతనం ఇవ్వలేమన్న మరో ఎయిర్ లైన్స్!

  • వేతనం ఇవ్వలేమని పవన్ హాన్స్ సర్క్యులర్
  • రూ. 89 కోట్ల నికర నష్టంలో ఉన్నామని వెల్లడి
  • మండిపడుతున్న ఉద్యోగుల సమాఖ్య

ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి మూతపడగా, వాటి దారిలోనే మరో సంస్థ కూడా నడుస్తోంది. ఇండియాలో చాపర్, ప్రైవేట్ జెట్, పర్సనల్ జెట్ సేవలందిస్తున్న పవన్ హాన్స్, తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనం ఇవ్వలేమని చేతులెత్తేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 89 కోట్ల నికర నష్టం నమోదైన కారణంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని, అందువల్ల వేతనాలు ఇవ్వలేమని చెబుతూ ఉద్యోగులకు ఓ సర్క్యులర్ పంపింది. ఇండియాలో పౌరవిమానయాన రంగం అభివృద్ధికి అవకాశాలు సానుకూలంగా లేవని ఈ సందర్భంగా సంస్థ వ్యాఖ్యానించింది.

కాగా, నికర నష్టం వచ్చిందన్న కారణంతో వేతనాలు ఇవ్వలేమని చెప్పడంపై సంస్థ ఉద్యోగుల సమాఖ్య తీవ్రంగా మండిపడింది. ఉద్యోగుల పట్ల అమానవీయ కోణంలో సంస్థ ప్రవర్తిస్తోందని, వేతనాల సవరణ జరుగుతుందని వేచి చూస్తున్న తమకు, అసలు వేతనమే ఇవ్వమని చెప్పడం తగదని వ్యాఖ్యానించింది. సంస్థలో ఉన్నతోద్యోగులు మాత్రం పెరిగిన వేతనాలు అందుకుంటున్నారని గుర్తు చేసిన ఉద్యోగ సంఘాలు, యాజమాన్యం వైఖరికి నిరసనగా నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై నిరసన తెలియజేస్తామని అన్నారు. కాగా, ఏప్రిల్ వేతనాలు అందని ఉద్యోగుల సంఖ్య స్వల్పమేనని, వారికి మాత్రమే సర్క్యులర్ పంపామని పవన్ హాన్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

Pawan Hans
Jet Airways
Kingfisher
April
Salary
  • Loading...

More Telugu News