West Bengal: మమతను సాగనంపకపోతే బెంగాల్ మరో కశ్మీర్‌లా మారడం ఖాయం: బీజేపీ నేత కైలాశ్
- మమతవి బుజ్జగింపు రాజకీయాలు
- ఆమె వల్లే ఐసిస్ బెంగాల్ వచ్చేందుకు సిద్ధమవుతోంది
- ఓటమి భయంతోనే మమత ముఖం దాచుకుంటున్నారు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై బీజేపీ నేత కైలాశ్ విజయవర్గియ తీవ్ర విమ్శలు చేశారు. సీఎం పదవి నుంచి ఆమెను సాగనంపకపోతే పశ్చిమ బెంగాల్ మరో కశ్మీర్‌లా మారడం ఖాయమన్నారు. హౌరాలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌లో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తామంటూ ఐసిస్ విడుదల చేసిన పోస్టర్‌పై స్పందించారు.
మమత బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల వల్ల రాష్ట్రంలో ఉగ్రవాదులు చెలరేగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు బెంగాల్‌లో అడుగు పెట్టాలనుకుంటున్నాయంటే అది మమత మెతక వైఖరి వల్లనేనని ఆరోపించారు. ఆమెను వీలైనంత త్వరగా సీఎం పీఠం నుంచి దించాలని, లేదంటే బెంగాల్ మరో కశ్మీర్ అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కైలాశ్ విజయవర్గియ.. ఓటమి భయంతోనే మమత ముఖం దాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.