Yamaleela: యమలీల చిత్రంలో అలీ పక్కన హీరోయిన్ అనగానే సౌందర్యకు జ్వరం వచ్చింది: నిర్మాత కె. అచ్చిరెడ్డి
- మొదట సంతోషంగా అంగీకరించింది
- శ్రేయోభిలాషుల మాటలతో సందిగ్ధంలో పడింది
- దాంతో మేమే వద్దనుకున్నాం
సరిగ్గా పాతికేళ్ల క్రితం తెలుగు తెరపై వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం యమలీల ఘనవిజయం అందుకుంది. కమెడియన్ అలీని హీరోగా పెట్టి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పెద్ద సాహసం చేశాడని అందరూ భావించారు. కానీ, రిలీజ్ తర్వాత ఆ సినిమాకు ప్రజల నుంచి లభించిన ఆదరణ, బాక్సాఫీసు వద్ద వసూళ్లు చూసి విమర్శకులు సైతం అచ్చెరువొందారు.
తాజాగా, యమలీల 25 ఏళ్ల ప్రస్థానంపై ఓ మీడియా చానల్ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి అలీ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చిరెడ్డి ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించారు. యమలీల చిత్రంలో ఇంద్రజకు ఎలా అవకాశం దక్కింది? అని యాంకర్ ప్రశ్నించగా, మొదట తాము హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నామని తెలిపారు.
"సౌందర్య కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. అప్పటికే ఆమె మాతో వరుసగా రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ వన్ చిత్రాలు చేసింది. దాంతో ఈ సినిమాలో కూడా సౌందర్య అయితే బాగుంటుందని ఆలోచించాం. అదే విషయం ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెతో చెబితే, మీరు ప్రత్యేకంగా అడగాలా అంటూ ఎంతో సంబరపడిపోయింది. ఆమె తండ్రి సత్యనారాయణ కూడా ఒప్పుకున్నారు.
అప్పటికే ఆమె పెద్ద హీరోల పక్కన సినిమాలు చేస్తోంది. ఈ సమయంలో అలీ పక్కన హీరోయిన్ గా చేస్తే ఎలా అని కొందరు శ్రేయోభిలాషులు చెప్పడంతో ఆమె డైలమాలో పడిపోయింది. చేయాలా, వద్దా అనుకుంటూ విపరీతంగా ఆలోచించి జ్వరం వచ్చేసింది.
ఆ విషయం ఆమె తండ్రి సత్యనారాయణ వచ్చి చెబితే మాకు తెలిసింది. దాంతో మేం వెళ్లి అడిగితే కంగారు పడిపోయింది. మేం కూడా ఆలోచించాం. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్. ఆమె ఇప్పుడో స్టార్, ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్ కు ఇబ్బంది కలిగే సినిమాల్లో నటించడం అవసరంలేదు అని భావించాం. ఆ విషయమే సౌందర్యతో చెప్పి ఆమెను ఊరడించాం.
అదే సమయంలో ఇంద్రజ గురించి అందరూ చెబుతుండడంతో ఆమె నటిస్తున్న సెట్స్ వద్దకు వెళ్లి చూశాం. కృష్ణారెడ్డి కూడా పర్ఫెక్ట్ అనడంతో ఇంద్రజను యమలీల సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాం" అంటూ అచ్చిరెడ్డి ఆనాటి వివరాలను తెలియజేశారు.