Andhra Pradesh: భయపెడుతున్న ఫణి తుపాను.. మత్స్యకారులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ హెచ్చరిక!

  • సముద్రంలోకి వెళ్లవద్దని సూచన
  • ఆర్డీవో, ఎమ్మార్వోలతో కమిటీల ఏర్పాటు
  • అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను నెమ్మదిగా తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం ట్రింకోమలి ప్రాంతానికి 750 కిలోమీటర్ల దూరంలో, అలాగే చెన్నైకి 1100 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడనున్న ఫణి పెను తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఒకవేళ భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్డీవోలు, ఎమ్మార్వోల నేతృత్వంలో ప్రభుత్వాధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారుతుందనీ, కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని కలెక్టర్ వినయ్ చంద్ హెచ్చరికలు జారీచేశారు.

తుపాను ఈ నెల 30న తీరం దాటేవరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్రజల కోసం తాము కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నంబర్లు 08592-222100, 281172, 231222 ఏర్పాటు చేశామని చెప్పారు. తీరప్రాంత ప్రజలు అధికారుల సూచన మేరకు నడుచుకోవాలనీ, అవసరమైతే పునరావాస శిబిరాలకు తరలివెళ్లాలని కోరారు. దక్షిణ కోస్తా, తమిళనాడుల మధ్య ఫణి తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

Andhra Pradesh
Prakasam District
collector
warning
  • Loading...

More Telugu News