Telangana: ఈ టార్చర్ తట్టుకోలేకున్నా.. నా చావయినా ఉన్నతాధికారుల కళ్లు తెరిపిస్తుందేమో!: రుద్రూరు సీఐ ఆవేదన
- వాట్సాప్ పోస్ట్ చేసిన దామోదర్ రెడ్డి
- తాను 30 ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేస్తున్నానని వ్యాఖ్య
- సీఐని సెలవుపై పంపిన ఉన్నతాధికారులు
తెలంగాణలోని రుద్రూరు సీఐ వాట్సాప్ పోస్టు ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో సీఐగా పనిచేస్తున్న దామోదర్ రెడ్డి వాట్సాప్ వేదికగా తన బాధను వెళ్లగక్కారు. ‘నేను 30 ఏళ్లుగా పోలీస్ శాఖలో నిస్వార్థంగా పనిచేస్తున్నా. ఈ వేధింపులు భరించలేకున్నా. నా చావయినా ఉన్నతాధికారుల కళ్లు తెరిపిస్తుందేమో’ అని పోలీస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు.
ఈ వేధింపులతో బతకడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు. అయితే తనను ఎవరు వేధిస్తున్నారన్న విషయమై దామోదర్ రెడ్డి స్పష్టత ఇవ్వలేదు. కాగా, త్వరలోనే ఏసీపీగా ప్రమోషన్ పొందాల్సిన దామోదర్ రెడ్డి ఈ వాట్సాప్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఆయన్ను సెలవుపై పంపారు. కాగా, సీఐ దామోదర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ వర్గాల్లో హాట్ హట్ గా చర్చ సాగుతోంది.