Sri Lanka: శ్రీలంకలో ఉగ్రవాదులతో సైన్యం భీకర ఎన్‌కౌంటర్.. 15 మంది హతం

  • ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా ఘటన
  • సాయంత్రం ప్రారంభమై రాత్రంతా కొనసాగిన ఎన్‌కౌంటర్
  • మృతుల్లో ముగ్గురు ఆత్మాహుతి దాడి సభ్యులు

ఈస్టర్ సండే రోజున ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదుల కోసం శ్రీలంక భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఈ క్రమంలో శ్రీలంక తూర్పు తీరంలో శుక్రవారం రాత్రంతా అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులతో జరిగిన భీకర్ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

అంపారాలోని సైంతమరుథులో శుక్రవారం సాయంత్రం అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రాత్రంతా కొనసాగినట్టు ఆయన తెలిపారు. హతమైన 15 మందిలో ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు ఉన్నారని మిలటరీ అధికార ప్రతినిధి సుమిత్ ఆటపట్టు పేర్కొన్నారు.

ఓ ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వచేశారని, చట్టుముట్టినప్పుడు దాడికి పాల్పడ్డారని, దీంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. హతమైన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే) సభ్యులుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. గత ఆదివారం చర్చిలపై దాడులకు పాల్పడింది కూడా ఈ సంస్థేనని అనుమానిస్తున్నారు.

కాగా, పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న వారి కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఇప్పటి వరకు 76 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సిరియా, ఈజిప్ట్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News