Intermediate: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు
- సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్సీ
- నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలి
- తెలంగాణ సీఎస్ జోషికి నోటీసులు జారీ
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్ అయింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. పరీక్ష తప్పిన విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ హెచ్ ఆర్సీ సూచిస్తూ తెలంగాణ సీఎస్ జోషికి నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు అందించిన సాయం వివరాలు తమకు తెలియజేయాలని పేర్కొంది. ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు తగిన ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మీడియా లేవనెత్తిన అంశాలు నిజమైతే పొరపాట్లకు కారణమైన అధికారులు మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. బాధ్యులను శిక్షించడమే కాదు, ఇది తలదించుకోవాల్సిన సంఘటన అని తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించింది.