Narendra Modi: మోదీ ఇప్పటికే గెలిచారు... ఓటేయకపోయినా ఫర్వాలేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు, వారితో జాగ్రత్త: వారణాసి ఓటర్లకు మోదీ హెచ్చరిక
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
- కుట్రదారుల వలలో పడొద్దు
- పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి రావాలి
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో ఇవాళ భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు, ప్రజానీకం తరలిరాగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. "మోదీ ఇప్పటికే గెలిచేశారు, ఇక ఓటు వేయకపోయినా ఫర్వాలేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు, వారి మాటలు విని ఓటేయకుండా ఉండొద్దు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి" అంటూ విజ్ఞప్తి చేశారు.
ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి కొందరు కుట్రలకు పాల్పడుతుంటారు, అలాంటివారి వలలో మీరు పడొద్దు అంటూ వారణాసి నియోజకవర్గ ప్రజలకు సూచించారు. పోలింగ్ రోజున భారీ సంఖ్యలో బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇక, గురువారం మోదీ నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రత్యర్థులు సైతం విస్తుపోయేలా అశేష జనవాహిని కదం తొక్కింది. దీనిపై మోదీ మాట్లాడుతూ, వారణాసిలో మాత్రమే ఇలాంటివి సాధ్యమని అన్నారు. గతంలో వారి ఆశీస్సులే తన విజయానికి కారణమని చెప్పారు.