Nirav Modi: నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురు
- బెయిల్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం
- జైల్లో ఉన్న నీరవ్ తో వీడియో కాన్ఫరెన్స్
- ఇటీవలే లండన్ లో అరెస్టయిన వజ్రాల వ్యాపారి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 48 ఏళ్ల నీరవ్ మోదీ రుణభారం భరించలేక కొంతకాలం కిందటే భారత్ నుంచి లండన్ పారిపోయారు. భారత్ విజ్ఞప్తి మేరకు మోదీని మార్చి 19న అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చారు.
ఇప్పటికే ఓసారి బెయిల్ విషయంలో దెబ్బతిన్న ఈ వజ్రాల వ్యాపారి మరోసారి దరఖాస్తు చేసుకున్నా, ఇక్కడి వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడికి వ్యతిరేక నిర్ణయం వెలువరించింది. జైల్లో ఉన్న నీరవ్ మోదీతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రక్రియ చేపట్టారు. దీనిపై తదుపరి విచారణ మే 24న ఉంటుందని, ఈ కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి విచారణ మే 30న జరుపుతామని కోర్టు పేర్కొంది.