Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు కొనసాగుతున్న నిరసనలు : సీపీఎం ధర్నా
- కార్యాలయం ముట్టడికి నాయకులు, కార్యకర్తల యత్నం
- అడ్డుకున్న పోలీసులు
- తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
ఇంటర్ వాల్యుయేషన్‌లో జరిగిన అవకతవకలపై పలు ప్రజా సంఘాల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం సీపీఎం నాయకులు, కార్యకర్తలు బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు మొక్కుబడిగా ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు ఇందిరాపార్క్ వద్ద ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. భారీ ఎత్తున విద్యార్థులు, సంఘం ప్రతినిధులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.