CBI: బ్యాంకును మోసం చేసినందుకు జీవిత ఖైదు విధించిన సీబీఐ కోర్టు!
- 2008లో ముంబై ఆంధ్రాబ్యాంకు నుంచి రుణం
- రూ. 2.80 కోట్లు తీసుకున్న రాజేంద్ర పాటిల్
- తప్పుడు పత్రాలు సమర్పించినట్టు తేల్చిన సీబీఐ
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆంధ్రాబ్యాంకును మోసం చేసి రూ. 2.80 కోట్ల రుణం పొందిన వ్యక్తికి ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. దాంతో పాటుగా రూ. 3.13 కోట్ల జరిమానాను కూడా విధించింది. ఈ కేసులో నిందితుడు రాజేంద్ర పాటిల్ కు సహకరించిన బ్యాంకు మాజీ మేనేజర్ మహిపాల్ కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 3.40 లక్షల జరిమానాను విధించింది.
2008 నాటి ఈ కేసులో పాటిల్ కార్లు కొనుగోలు చేస్తానంటూ ఘోడ్ బందర్ లోని ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్ ని సంప్రదించి తొలుత రూ. 2.03 కోట్లు, ఆపై రాణేలో స్థలం కొనుగోలు పేరిట మరో రూ. 80 లక్షలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా తప్పుడు తనఖా పత్రాలను బ్యాంకుకు సమర్పించగా, అందుకు మహిపాల్ సహకరించాడు.
ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పసిగట్టి, కేసును సీబీఐకి అప్పగించారు. అతను తప్పుడు పత్రాలు ఇచ్చాడని, కార్లను కూడా కొనలేదని తేల్చిన సీబీఐ, ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కేసు విచారణ దాదాపు పదేళ్లకు పైగా సాగగా, ఇంతకాలానికి తీర్పు వచ్చింది.