Chandrababu: ఈసీకి 9 పేజీల లేఖను రాసిన చంద్రబాబు!
- సంక్షేమాన్ని అడ్డుకోవద్దు
- ప్రభుత్వ కార్యక్రమాలపై ఆంక్షలు వద్దు
- సమీక్ష చేసుకునే హక్కు ఉందన్న చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని, ఎన్నికల ఫలితాలు వెల్లడికాలేదన్న సాకు చూపుతూ ఈసీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి 9 పేజీల లేఖను రాసిన ఆయన, పలు విషయాలను ప్రస్తావించారు. ఈ వేసవిలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న పనులను ఈసీ అడ్డుకుంటోందని ఆరోపించారు. తాగునీటి సమస్య, పోలవరం, రాజధాని నిర్మాణం తదితరాలపై ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునేలా ఆంక్షలు పెట్టవద్దని తన లేఖలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వానికి శాఖల సమీక్ష చేసే హక్కు ఉందని పేర్కొన్న చంద్రబాబు, ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని విమర్శించారు.