Hyderabad: ఉద్యోగం పేరుతో హైదరాబాద్ యువతిని దోహాలో అమ్మేసిన మహిళ
- దారుణంగా మోసపోయిన యువతి
- యువతిని రెండు లక్షలకు అమ్మేసిన మహిళ
- సుష్మాస్వరాజ్‌కు బాధితురాలి తల్లి వేడుకోలు
నర్సు ఉద్యోగం పేరుతో హైదరాబాద్ యువతిని దోహాలో అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కుర్మగూడకు చెందిన సయీదా మరియం వృత్తిరీత్యా నర్సు. టోలీ చౌకికి చెందిన ఫాతిమాతో ఆమెకు ఆసుపత్రిలో పరిచయం అయింది. ఈ క్రమంలో ఖతర్ రాజధాని అయిన దోహాలో మంచి నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆమెను బుట్టలో పడేసింది. అక్కడ నర్సు ఉద్యోగాలకు బోల్డంత గిరాకీ ఉందని, అక్కడికి వస్తే మంచి వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది.
ఆమె మాటలు నమ్మిన మరియం మార్చి 19న దోహా వెళ్లింది. అయితే, నర్సు ఉద్యోగం ఇప్పిస్తానన్న ఫాతిమా ఆమెను రూ.2 లక్షలకు ఇతరులకు విక్రయించినట్టు తెలిసి నివ్వెరపోయింది. చేసేది లేక పనిమనిషిగా మారింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. మరోవైపు, విషయం తెలిసిన మరియం తల్లి తబుస్సుం బేగం ఏజెంట్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఫిర్యాదు చేసింది. నర్సు ఉద్యోగం పేరుతో తన కుమార్తెను అమ్మేశారని, అధికారులు స్పందించి తన కుమార్తెను వెనక్కి తీసుకురావాలని కోరింది.