Supreme Court: జస్టిస్ రంజన్ గొగోయ్ పై కుట్ర... నిగ్గు తేల్చే బాధ్యత మాజీ న్యాయమూర్తికి అప్పగింత!
- సహకరించాలంటూ సీబీఐ, ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఆదేశం
- స్వతంత్ర విచారణ అవసరమని భావించిన సుప్రీం త్రిసభ్య కమిటీ
- బైన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ పై విచారణ
ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర విచారణ అవసరమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ తో ఏక సభ్య విచారణ కమిటీని నియమించింది.
జస్టిస్ రంజన్ గొగోయ్ పై కావాలనే కొందరు స్వార్థపూరితంగా కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఉత్సవ్ బైన్స్ అనే న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్ ను అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా, ఆర్ఎఫ్ నారిమన్ లతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించిన సందర్భంగా తాజా నిర్ణయం తీసుకుంది. ఇందులో కుట్రకోణాన్ని వెలికితీసేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్ ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈ విచారణలో ఆయనకు సీబీఐ, ఇంటలిజెన్స్ శాఖల డైరక్టర్లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సహకరించాలంటూ స్పష్టం చేసింది.