Sri Lanka: శ్రీలంకలో చర్చిలన్నీ మూసివేత.. మతపెద్దల కీలక నిర్ణయం!
- ఇటీవల ఉగ్రదాడులతో నెత్తురోడిన శ్రీలంక
- 359 మంది దుర్మరణం, 500 మందికి గాయాలు
- రక్షణ శాఖ సూచనతో చర్యలు తీసుకున్న మతపెద్దలు
శ్రీలంకలో ఇటీవల ఉగ్రమూకలు సృష్టించిన మారణకాండతో 359 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈస్టర్ రోజున చర్చిలు, విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రైస్తవ మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిల్లో ప్రార్థనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయమై సీనియర్ మతబోధకుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. చర్చిల వద్ద భద్రతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగా రక్షణ ఏర్పాట్లను కల్పిస్తున్నామన్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ సూచన మేరకు చర్చిలను కొన్ని రోజులు మూసివేస్తున్నామని చెప్పారు. ప్రజలంతా ఈ ఆదివారం ఇళ్ల దగ్గరే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. తాము చెప్పేవరకూ ప్రజలు చర్చిలకు రావొద్దని కోరారు. శ్రీలంక ఉగ్రదాడిలో దాదాపు 500 మంది గాయపడగా, వీరిలో చాలామంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.