Kidnap: మాచర్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం... క్వారీ గుంతలో శవమై తేలిన వైనం!
- 22న సాధిక్ కిడ్నాప్ అయ్యాడని కేసు
- 23న గుంటూరులో కనిపించినట్టు వీడియో
- 25న మాచర్లలోనే విగతజీవిగా దర్శనం
- మొత్తం ఉదంతం వెనుక అనుమానాలు
గుంటూరు జిల్లా మాచర్లలో కిడ్నాప్ అయిన ఆరు సంవత్సరాల బాలుడు సాయి సాధిక్ కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. బాలుడి మృతదేహాన్ని మాచర్ల శివార్లలోనే ఉన్న క్వారీ గుంతలో పోలీసులు గుర్తించారు. 22న ఇంటిముందు ఆడుకుంటున్న సాధిక్, అదృశ్యంకాగా, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించగా, 23వ తేదీన గుంటూరు రైల్వే స్టేషన్ లో సాధిక్ ను తీసుకు వెళుతున్న ఓ వ్యక్తి కనిపించాడంటూ, అతని చిత్రాలను, వీడియోను మీడియాకు విడుదల చేశారు.
కిడ్నాపర్ నుంచి ఫోన్ వస్తుందని భావిస్తున్న తల్లిదండ్రులు వెంకటేశ్వర నాయక్, సరోజ దంపతుల ఆశలను అడియాసలు చేస్తూ అతని మృతదేహం మాచర్ల శివార్లలోని క్వారీలో కనిపించడం తీవ్ర సంచలనమైంది. బాలుడి తండ్రి వెల్దుర్తి మండలంలోని కండ్లకుంట మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మాచర్లలో ఉంటూ నిత్యమూ వెళ్లి వస్తుంటారు. బిడ్డ మరణంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తుంటే, ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.
కాగా, ఈ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడిని ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడని, అతన్ని గుంటూరు రైల్వే స్టేషన్ లో గుర్తించామని, బాలుడిని కనుగొనేందుకు ఐదు టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పిన పోలీసులు, ఇప్పుడు బాలుడు ఆడుకుంటూ వెళ్లి క్వారీ గుంతలో పడివుండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అలాకాకుండా, ఒకవేళ కిడ్నాపర్ బాలుడిని గుంటూరు వరకూ తీసుకెళ్లాడనుకుంటే, తిరిగి అతన్ని మాచర్లకు తీసుకువచ్చి ఎందుకు చంపాడన్న అనుమానాలకు సమాధానం దొరకాల్సివుంది.