IMAX: ఐమాక్స్ 'మిర్రర్ మేజ్'లో లైంగిక వేధింపులు... ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష!

  • రెండేళ్ల క్రితం ఘటన
  • కేసును విచారించిన సెషన్స్ కోర్టు
  • దోషికి జైలుశిక్షతో పాటు జరిమానా కూడా

హైదరాబాద్ లోని ఐమాక్స్ లో ఉండే మిర్రర్ హౌస్ లో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఓ ఉద్యోగికి న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు రెండేళ్ల క్రితం, తమ కుటుంబీకులతో కలిసి ఐమాక్స్ చూడటానికి ఈ ఇద్దరు బాలికలూ వెళ్లారు. అక్కడ ఉన్న మిర్రర్ మేజ్ హౌస్ ను చూసేందుకు లోపలికి వెళ్లారు.

ఈ హౌస్ లో బయటి వెలుగుతో పోలిస్తే, చాలా తక్కువ కాంతి ఉంటుంది. చుట్టూ ఉండే అద్దాలు ఎంతో కన్ ఫ్యూజ్ చేస్తాయి. దీన్నుంచి బయటకు రావడం అంత సులువు కాదు. లోపలికి వెళ్లే వారికి సహాయం చేసేందుకు కొందరు ఉద్యోగులు కూడా ఉంటారు. వారి సూచనల మేరకు చేతులతో తడుముకుంటూ, అద్దాల మార్గం గుండా బయటకు రావాల్సి వుంటుంది.

ఇక ఈ ఇద్దరు బాలికలూ లోపలికి వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న రతన్ ఆనంద్ (24) అనే యువకుడు వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆపై బయటకు వచ్చిన వారు, తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసును విచారించిన మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కే సునీత, రతన్ ఆనంద్ ను దోషిగా తేల్చి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News