Ranjan Gogoi: రంజన్ గొగోయ్ పై మహిళను ప్రయోగించింది వారేనా?... వెనుక అనిల్ అంబానీ - ఎరిక్సన్ వ్యవహారం!
- ఉద్యోగాలను పోగొట్టుకున్న మానవ్ శర్మ, తపస్ కుమార్
- తీర్పును తప్పుగా రాయడంతో డిస్మిస్
- వారే కుట్ర వెనుక భాగస్వాములంటున్న సీనియర్ న్యాయవాది
- ఆధారాలున్న సీల్డ్ కవర్ ధర్మాసనం ముందుకు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక, గతంలో అనిల్ అంబానీ - స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ సెటిల్మెంట్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును మార్చి అప్ లోడ్ చేసి ఉద్యోగాలను పోగొట్టుకున్న మానవ్ శర్మ, తపస్ కుమార్ చక్రవర్తి ఉన్నారన్న ఆరోపణలు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తపస్, మానవ్ ల ప్రమేయంపై సీనియర్ న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్, తన వద్ద ఉన్న ఆధారాలను, సీసీటీవీ ఫుటేజ్ డిస్క్ లను, కీలక పత్రాలను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఇప్పటికే అందించారు. వీరిద్దరూ కలిసి రంజన్ గొగోయ్ మీదకు మహిళను ప్రయోగించారని ఆయన చేసిన ఆరోపణలపై స్పందించిన ధర్మాసనం, కుట్ర మూలాలను ఛేదిస్తామని స్పష్టం చేసింది.
అనిల్ అంబానీకి వ్యక్తిగత మినహాయింపులు ఇచ్చే అంశంపై న్యాయమూర్తులు ఇచ్చిన రూలింగ్ ను వీరిద్దరూ మార్చినట్టు తేలడంతో, చీఫ్ జస్టిస్ వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. ఆపై మాజీ మహిళా ఉద్యోగి, కొందరు కార్పొరేట్ లాబీయిస్టులు కుమ్మక్కై గొగోయ్ పై లైంగిక ఆరోపణల కుట్ర పన్నారన్నది బెయిన్స్ ఆరోపణ. ఈ ఆరోపణలను బెయిన్స్ నిరూపించకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని న్యాయమూర్తులు హెచ్చరించగా, తన వద్ద తిరుగులేని ఆధారాలు మరిన్ని ఉన్నాయని, వాటిని కూడా ధర్మాసనం ముందుంచుతానని బెయిన్స్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, సీబీఐ, ఐబీ చీఫ్ లతో భేటీ అయిన న్యాయమూర్తులు, ఆరోపణల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపైనా చర్చించారు. ఇప్పటికే 26వ తేదీన విచారణకు హాజరు కావాలని, లైంగిక ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగినికి నోటీసులు ఇచ్చారు. ఇదిలావుండగా, ఇక తమ ఇళ్లలో మహిళా ఉద్యోగులు వద్దే వద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద విధుల్లో ఉన్నవారిని సరెండర్ చేస్తున్నారు.