Anantapur District: గట్టిగా అరిచినంత మాత్రాన ఫలితాలు మారవు.. విజయం మాదే: టీడీపీ నేత జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
- నా తండ్రి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు
- ఎవరూ రూ.50 కోట్లు ఖర్చు చేయడం లేదు
- వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ఆనందపడుతున్నారు
విజయం మాదేనంటూ గట్టిగా అరిచి చంకలు గుద్దుకుంటున్నంత మాత్రాన ఫలితాలు మారవని, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ తరఫున అనంతపురం లోక్ సభ స్థానానికి పోటీ చేసిన జేసీ పవన్‌కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాలు పొందిన జిల్లా యువకులకు బుధవారం ఆయన చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఎంతో కష్టపడడం వల్లే రాష్ట్రానికి కియా పరిశ్రమ వచ్చిందన్నారు. ఆయన కృషి వల్ల ఎందరికో ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నేతలనే ప్రజలు గౌరవిస్తారని పవన్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు 431 మందికి కియా పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్నికల ఖర్చు రోజురోజుకు పెరుగుతోందన్న తన తండ్రి జేసీ వ్యాఖ్యలతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలు తొలి విడతలోనే జరిగాయని, కాబట్టి ఖర్చు చాలా తగ్గిందని అన్నారు. ఎక్కడా, ఎవరూ రూ.50 కోట్లు ఖర్చు చేయలేదని పవన్ కుమార్ అన్నారు.
తాము గెలుస్తున్నామంటూ వైసీపీ నేతలు అరిచి చెబుతున్నారని, అరిచినంత మాత్రాన ఫలితాలు మారబోవన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గతంలో కంటే మరింత ఎక్కువ మెజారిటీ రాబోతోందని, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం పక్కా అని అన్నారు. వైసీపీ నేతలు దుష్ప్రచారంతో సంబరపడుతున్నారని, అది తాత్కాలికమేనని పవన్ కుమార్ పేర్కొన్నారు.