Congress: అప్పుడు, ఆ పార్టీలోనే కొనసాగడమంటే బుద్ధి లేనివాడినే అనుకున్నా: జేసీ దివాకర్ రెడ్డి
- విభజన వద్దని సోనియాకు చెప్పినా వినలేదు
- ‘కాంగ్రెస్ చచ్చిపోయింది.. పూడ్చిపెట్టాలి’
- ఆ వ్యాఖ్యలు ఆ పార్టీలో ఉండగానే చేశాను
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో తన సంభాషణ గురించి జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే నాకు డిపాజిట్ కూడా దక్కదు’ అని నాడు సోనియాగాంధీకి చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందని, విభజన చేయొద్దని రెండు మూడుసార్లు సోనియాగాంధీకి చెప్పానని, అయినా, ఆమె వినలేదని, దీంతో, రెండు రాష్ట్రాలు వేరై పోయాయని అన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. దీన్ని ఆరడుగుల గుంత తీసి పూడ్చిపెట్టాలి’ అని సోనియాగాంధీతో నేను మాట్లాడిన తర్వాత చెప్పిన మాటలివి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో బ్రతుకే లేదని, ఇరవై లేదా ముప్పై సంవత్సరాల వరకు గానీ ఈ పార్టీ తిరిగి పుంజుకోదని తెలిసి కూడా అదే పార్టీలో తాను కొనసాగడమంటే ‘బుద్ధి లేనివాడిని, లోకజ్ఞానం లేని వాడినే అవుతాను’ అని అన్నారు.
అప్పుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొస్తే తనకు ఇద్దరు కనపడ్డారని, ఒకరు చంద్రబాబునాయుడు, రెండో వారు జగన్ అని అన్నారు. జగన్ ని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు చంద్రబాబునాయుడని అనుకుని టీడీపీలో చేరడం జరిగిందని చెప్పుకొచ్చారు.