ranjay gogoi: రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల కేసు... సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీసులకు సుప్రీం సమన్లు!
- గొగోయ్ ని కుట్రపూరితంగా ఇరికిస్తున్నారన్న ఆరోపణలపై సుప్రీం విచారణ
- ఆధారాలు సీల్డ్ కవర్ లో అందించాలంటూ లాయర్ బైంసాకు సమన్లు
- న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న జస్టిస్ మిశ్రా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను కుట్రపూరితంగా లైంగిక వేధింపుల కేసులో ఇరికిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ముమ్మర విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ సీబీఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ లకు సమన్లు జారీ చేసింది. దీనిపై చర్చించేందుకు ఈ మూడు సంస్థల చీఫ్ లు ఈరోజు న్యాయమూర్తుల ఛాంబర్ కు రావాలని ఆదేశించింది. రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది.
మరోవైపు, డబ్బు తీసుకుని తీర్పు చెప్పించే దళారీ వ్యవస్థకు రంజన్ గొగోయ్ చెక్ పెట్టినందుకే ఆయనను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ బైంసా అనే లాయర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పడంతో... ఆధారాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆయనకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఆరోపణలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత విషయంలో పెను సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు జస్టిస్ గొగోయ్ సిద్ధపడటం గొప్ప విషయమని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని ప్రశంసించారు. ఏదైనా కుట్ర ఉంటే మాత్రం... ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. న్యాయవ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.