New Delhi: ఐదుగురి ప్రాణాలు కాపాడి ఓ కానిస్టేబుల్‌ మరణం: వీరుడా నీకు శాల్యూట్‌ అంటున్న జనం

  • పట్టాలపై నిల్చున్న దంపతులను కాపాడిన పోలీస్‌
  • అనంతరం వారి పిల్లల్ని కాపాడిన ధైర్యవంతుడు
  • ఈ క్రమంలో రైలు ఢీకొట్టి దుర్మరణం

రైలు దూసుకు వస్తున్న సమయంలో సాహసం చేస్తే ఏ మాత్రం తేడా అయినా తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఆ రైల్వే కానిస్టేబుల్‌ వెనుకడుగు వేయలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడడం తన ప్రథమ కర్తవ్యంగా భావించి ఐదుగురి ప్రాణాలను కాపాడాడు. ఆ క్రమంలో తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. కానిస్టేబుల్‌ సాహసం విని వీరుడా నీకు శాల్యూట్‌ అని దేశవాసులు కీర్తిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...ఢిల్లీలోని అజాద్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా జగ్బిర్‌సింగ్‌ రానా (50) పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఆయన విధుల్లో భాగంగా ఆదర్శనగర్‌, అజాద్‌పూర్‌ రైల్వేస్టేషన్ల మధ్య పెట్రోల్‌ నిర్వహిస్తున్నాడు.

ఏడో నంబరు సిగ్నల్‌ పాయింట్‌ వద్ద రైలు పట్టాలపై గొడవపడుతున్న దంపతులను గమనించాడు. ఆ సమయంలో హోషియార్పూర్‌ రైలు వస్తుండడంతో పరుగున వెళ్తూ దంపతులను తప్పుకోవాలని హెచ్చరించాడు. ఇద్దరినీ పక్కకు తోసేసి తాను తప్పుకున్నాడు. అయితే అదే సమయంలో పక్కనున్న పట్టాలపై వీరి పిల్లలు ఉండడం గమనించిన రానా ఆ మార్గంలో కల్కా ఎక్స్‌ప్రెస్‌ రావడాన్ని గమనించాడు. వెంటనే వారిని రక్షించేందుకు అరుస్తూ పరుగందుకున్నాడు.

కానిస్టేబుల్‌ అప్రమత్తతతో చిన్నారులు పక్కకు తప్పుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ రానాను రైలు ఢీకొట్టింది. దీంతో అతను 15 మీటర్ల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దంపతులు, వారి పిల్లల ప్రాణాలు కాపాడే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయిన రానా ధైర్యసాహసాలను పలువురు అభినందించినా, ఆయన విషాదాంతంపై సంతాపం వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన రానాకు సాహస పురస్కారం అందించాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. రానా కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు. 1989లో ఆర్‌పీఎఫ్‌లో చేరిన రానాకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News