Assam: ఒకరికి ఓటేస్తే వేరొకరికి పడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసోం మాజీ డీజీపీ
- తన ఓటు వేరొకరికి పడిందన్న హరేకృష్ణ
- తన ఓటును తొలగించాల్సిందిగా అధికారులను కోరిన మాజీ డీజీపీ
- కుదరదన్న అధికారులు
ఈవీఎంలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ అసోం మాజీ డీజీపీ హరేకృష్ణ దేక చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసోంలో మంగళవారం మూడో విడత ఎన్నికలు జరిగాయి. తాను లచిత్‌నగర్‌లోని కాళీమందిర్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెప్పిన హరేకృష్ణ.. ఓటేసిన తర్వాత వీవీప్యాట్‌లో చూడగా వేరే అభ్యర్థి పేరు కనిపించిందన్నారు.
ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన ఓటును తొలగించాల్సిందిగా కోరినట్టు చెప్పారు. అయితే, ఒకసారి పోలైన ఓటును తొలగించలేమని వారు తనతో చెప్పినట్టు తెలిపారు. అసోంలో జరిగిన మూడో విడత ఎన్నికల్లో మొత్తం 72 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.