CM: సీఎం సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- సమీక్షలపై ఆంక్షలు పెట్టడమేంటి?
- రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతాం
- ఓట్ల లెక్కింపును నిలిపివేయాలి
సీఎం సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. నేడు విజయవాడ దాసరి భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు కానీ సీఎం సమీక్షలపై ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని పలు నియోజకవర్గాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతామని ఆయన తెలిపారు.
రీ పోలింగ్ విషయమై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. ఎన్నికల్లో డబ్బు పట్టుబడిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ఈసీని కోరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి విషయమై చర్య తీసుకోవాలని, ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్టు రామకృష్ణ తెలిపారు.