newzeland: న్యూజిలాండ్ లో మసీదులపై కాల్పులకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఉగ్రదాడి!: శ్రీలంక మంత్రి రువాన్ విజేవర్దనే
- ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్ర బీభత్సం
- 321 మంది దుర్మరణం, 500 మందికి గాయాలు
- 40 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
శ్రీలంకలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 321 మంది అమాయక ప్రజలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 500 మంది గాయపడ్డారు. ఈ దాడి వ్యవహారంపై విచారణ జరిపేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కమిటీని నియమించారు. ఇటీవల న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చిలో రెండు మసీదులపై జరిగిన దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో చర్చ్ లు, స్టార్ హోటళ్లను ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకున్నాయని ఈ విచారణలో తేలింది.
తమ ప్రాథమిక విచారణలో ఈ విషయం తేలిందని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే పార్లమెంటుకు తెలిపారు. స్థానిక తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) ఈ దాడుల వెనుక ఉన్నట్లు తేలిందనీ, అయితే ఈ సంస్థకు విదేశీ ఉగ్రసంస్థల నుంచి సాయం అందిందా? అనే కోణంలో విచారణ సాగుతోందని పేర్కొన్నారు. ఏడుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన నేపథ్యంలో వారితో సంబంధమున్న 40 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మరోవైపు 321 మంది చనిపోయిన నేపథ్యంలో శ్రీలంక ఈరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.
దీంతో పలు ప్రభుత్వ భవనాలపై శ్రీలంక జాతీయ జెండాను అవనతం చేశారు. న్యూజిలాండ్ లో ఈ ఏడాది మార్చి 15న క్రైస్ట్ చర్చ్ లో ఉన్న రెండు మసీదులలో శ్వేతజాతి క్రైస్తవ మతస్తుడు అయిన బ్రెంటన్ టర్రంట్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దీనికి ప్రతీకారంగానే ఉగ్రమూకలు శ్రీలంకలో ఈస్టర్ రోజున అమాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.