Maharashtra: ఊరంతా ఒకే అభ్యర్థికి ఓటేస్తారు.. ఎప్పుడు చూసినా 100 శాతం పోలింగ్ నమోదు.. ఘోల్ గ్రామం రికార్డు!
- మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో ఉన్న గ్రామం
- సర్పంచ్ మాటకు విలువనిచ్చి ఓటేస్తున్న ప్రజలు
- అనేక సమస్యలతో సతమతమవుతున్న గ్రామం
సాధారణంగా ఏ గ్రామంలోనూ కూడా ప్రజలంతా ఒకే పార్టీకి ఓట్లేయరు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వేస్తారు. కానీ మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానంలో ఉన్న ఘోల్ అనే ఊరి స్టయిల్ మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ ఊరిలో ప్రజలంతా ఒకే మాట మీద ఉంటారు. అభ్యర్థిని కూడా పట్టించుకోరు. గ్రామపెద్ద లేదా సర్పంచ్ ఎవరికి ఓటేయాలని చెబితే వారికి మూకుమ్మడిగా వేసేస్తారు.
అన్నట్లు ఈ ఊరిలో ఉండే ఓటర్లు కేవలం 100 మంది మాత్రమే. ప్రస్తుతం ఈ గ్రామానికి ఫూలాబాయి పోలేకార్ సర్పంచిగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందుగా ఈ ఊరిలో సర్పంచి సమావేశం ఏర్పాటుచేస్తారు. ఫలానా పార్టీకి మనం ఓటు ఎందుకు వేయాలంటే? అని కారణాలను వివరిస్తారు. అనంతరం తు.చ. తప్పకుండా ఊరి వాళ్లంతా 100 శాతం ఒకే పార్టీ గుర్తుకు ఓట్లు వేసేస్తారు.
అన్నట్లు ఈ ప్రాంతంలో ఇబ్బందులేవీ లేవు అనుకుంటే మీరు పొరపడినట్లే. ఈ గ్రామాన్ని నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూణే పట్టణానికి, ఈ ఊరికి రోజుకు ఒక్క బస్సు సర్వీసు మాత్రమే నడుస్తుంది. ఇక్కడ సరైనరోడ్డు కూడా లేదు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాఠశాలను ఐదేళ్ల క్రితం మూసేశారు.
దీంతో పిల్లలతో కలిసి చాలా మంది వలస వెళ్లిపోతున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ గ్రామస్తులు మాత్రం 1970 నుంచి ఓటు వేసేందుకు సరిగ్గా ఎన్నికలకు ముందు స్వగ్రామానికి చేరుకుంటారు. 100 శాతం ఓటు హక్కును వినియోగించుకుంటూ దేశమంతటికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.