Crime News: స్నేహం నటిస్తూ పొరుగింటిలో బంగారం అపహరణ.. దంపతుల గుట్టురట్టు!

  • వీరికి సహకరించిన మరొకరి అరెస్టు
  • పక్కింటి మహిళ వంటింట్లో ఉండగా 10 తులాల బంగారం చోరీ
  • బాధితురాలి ఫిర్యాదుతో కేసును ఛేదించిన పోలీసులు

పక్కింటి మహిళే కదా అని ఇచ్చిన చనువును ఆమె దుర్వినియోగం చేసుకుంది. వారింట్లో ఉన్న నగలు కొట్టేస్తే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తన అవసరాలు తీరుతాయని భావించి భర్తతో కలిసి అపహరణకు పాల్పడింది. పోలీసుల రంగప్రవేశంతో మొత్తం గుట్టురట్టయి కటకటాలపాయ్యింది.

వివరాల్లోకి వెళితే...నారాయణపేట జిల్లాకు చెందిన జి.శోభారాణి అలియాస్‌ భాగ్యశ్రీ, బ్యాగరి సాయిసూరజ్‌లు పది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం నాగోలు గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. పక్కింట్లో ఉండే గౌతమితో భాగ్యశ్రీ పరిచయం పెంచుకుంది. తరచూ వారి ఇంటికి వెళ్లి వస్తుండేది. ఓ సందర్భంలో గౌతమి ఓ శుభకార్యానికి వెళుతున్నప్పుడు వేసుకున్న బంగారు నగలు చూసిన భాగ్యశ్రీకి కన్నుకుట్టింది. వాటిని కొట్టేయాలన్న ఆలోచన వచ్చింది.

గౌతమి క్యాంపు నుంచి తిరిగి వచ్చాక తాను వేసుకున్న పది తులాల బంగారం నగలు తీసి కప్‌ బోర్డులో పెట్టడం గమనించింది. ఓరోజు గౌతమి వంట గదిలో పనిలో ఉండగా భాగ్యశ్రీ భర్తతో కలిసి వచ్చింది. అతన్ని బయట కాపలాగా ఉంచి గుట్టుచప్పుడు కాకుండా బెడ్‌రూంలోకి ప్రవేశించింది. కప్‌ బోర్డులో ఉంచిన నగలు కొట్టేసి చడీచప్పుడు లేకుండా వెళ్లిపోయింది. శ్రీరామ నవమి సందర్భంగా నగల కోసం వెతికిన గౌతమికి అవి కనిపించక పోవడంతో భాగ్యశ్రీపైకి అనుమానం వెళ్లింది.

దీంతో ఎల్బీనగర్‌ ఠానాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి భాగ్యశ్రీ దంపతుల బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. ఇటీవల కాలంలో వారి అకౌంట్‌కు పెద్దమొత్తంలో జమవుతుండడం గమనించి తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం భాగ్యశ్రీ చెప్పేయడంతో ఆమెతోపాటు ఆమె భర్త సాయిని అరెస్టు చేశారు. దొంగిలించిన బంగారం అమ్మేందుకు సాయం చేసిన వీరి సమీప బంధువు, చత్రినాకకు చెందిన పాపిరెడ్డిని సైతం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News