Telangana: తెలంగాణ ఇంటర్ బోర్డు ముందు టెన్షన్.. మూడంచెల భద్రత ఏర్పాటుచేసిన పోలీసులు!
- ఇంటర్ పరీక్షల్లో పలువురు ఫెయిల్
- బోర్డు కార్యాలయం ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన
- పనిచేయని సంస్థ వెబ్ సైట్
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ భారీగా తల్లిదండ్రులు హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ‘లేదంటే మీ అందరిని అరెస్ట్ చేస్తాం’ అని హెచ్చరిస్తున్నారు.
దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ న్యాయమని నిలదీస్తున్నారు. ఈ విషయమై కొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. తాము రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.