Nellore District: ఆత్మకూరు పాఠశాల మరుగుదొడ్ల సమీపంలో మరోమారు కలకలం రేపిన వీవీప్యాట్ స్లిప్పులు..
- గతంలో ఇదే పాఠశాల ఆవరణలో లభించిన 200 స్లిప్పులు
- నోటా గుర్తుతో ఉన్న మరో నాలుగు స్లిప్పులు లభ్యం
- స్వాధీనం చేసుకున్న పోలీసులు
దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలు జరుగుతున్న వేళ వీవీప్యాట్ స్లిప్పులు మరోమారు కలకలం రేపాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 200 వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయి. వాటిని గుర్తించిన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు చేరవేశారు. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అవి ఈవీఎంల ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో అవి లభించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
తాజాగా, ఇదే పాఠశాలలో మరోమారు వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయి. పాఠశాల మరుగుదొడ్ల సమీపంలో నాలుగు స్లిప్పులు కనిపించాయి. వీటిపై నోటా గుర్తులున్నాయి. విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారొచ్చి స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఉన్న వివరాల ఆధారంగా దేపూరు పోలింగ్ కేంద్రం అధికారులను పోలీసులు విచారించారు. ఇవి మాక్ పోలింగ్ స్లిప్పులని వారు వివరణ ఇచ్చినట్టు సమాచారం.