Chandrababu: చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే లక్ష్మీనారాయణకు మా పార్టీలో స్థానం లేదు: విజయసాయిరెడ్డి
- కోవర్టు ఆపరేషన్ల కోసం వైసీపీలో చేరాలనుకుంటున్నారేమో
- సీఎస్ ను ఇరికించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
- నాలుగు రోజుల్లో పోయేవారికి భయపడాల్సిన అవసరం లేదు
సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సీబీఐలాంటి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాల వద్ద పెట్టిన వ్యక్తి దేశాన్ని మార్చాలని కలలు కంటున్నానని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఆయనకు వైసీపీలో స్థానం లేదని చెప్పారు. కోవర్టు ఆపరేషన్ల కోసం వైసీపీలో ఆయన చేరాలనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను బలపరుస్తోందని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత మొత్తం ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఓటు వేసిన జనాలకు లేని అనుమానాలు చంద్రబాబుకు వస్తున్నాయని దుయ్యబట్టారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇరికించేందుకు బాబు అండ్ కంపెనీ ఒత్తిళ్లు మొదలు పెట్టిందని విజయసాయి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని సీఎస్ ను బెదిరిస్తున్నారని అన్నారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకునేవారికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.