Revanth Reddy: ఆ పన్నెండు మంది చావుకు కారణం కేసీఆరే: రేవంత్ రెడ్డి
- విద్యాశాఖ మంత్రి వైఫల్యం చెందాడు
- కేసీఆర్ కు బాధ్యత లేదా?
- పోలీసులతో సమస్యను అణచివేయాలని చూస్తున్నారు
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి తీవ్ర అయోమయంలో పడడానికి సీఎం కేసీఆరే కారణమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఏంచేస్తున్నారని రేవంత్ నిలదీశారు.
"ఇవాళ వేల మంది విద్యార్థుల భవిష్యత్ ఆందోళనలో పడింది. బాగా చదివే విద్యార్థులకు సున్నా మార్కులు వేసి వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.1000 కట్టిన వాళ్లకు రీవాల్యూయేషన్ చేసి వాళ్ల పేపర్లు వాళ్లకు ఇవ్వడానికి ఏంటి మీకొచ్చిన సమస్య? ఇన్ని వేలమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్ష జరపడంలేదు? సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం లేదా? విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాల్సిన బాధ్యత లేదా?" అని నిలదీశారు.
"ఇవాళ పేపర్ల వాల్యూయేషన్ లో అవకతవకల వల్లే ఇంతటి ఉపద్రవం వచ్చిపడింది. ఆ పన్నెండు మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఆయన మంత్రిగా వైఫల్యం చెందాడు. ఈ మొత్తం తతంగానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. ఇవి ఆత్మహత్యలు కావు, ముఖ్యమంత్రి చేసిన హత్యలే! ఇందుకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పారిపోయి, పోలీసులతో అణచివేయాలని చూస్తోంది" అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.