Kerala: కలెక్టర్‌ గారు... ఎన్నికల సామగ్రి పెట్టెలు మోశారు!

  • కేరళ రాష్ట్రం త్రిశ్శూర్‌ కలెక్టరేట్‌ వద్ద ఘటన
  • సిబ్బందితో కలిసి తానూ పనిచేసిన జిల్లా అధికారి
  • సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వెల్లువ

అధికారులు ఆదర్శంగా వ్యవహరిస్తే సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారనేందుకు ఉదాహరణ ఈ ఘటన. ఆమె ఓ జిల్లా కలెక్టర్‌. అధికార దర్పానికి లోటులేని పోస్టు అది. కనుసైగతో శాసించి సిబ్బందితో పనిచేయించుకోగల స్థాయి ఆమెది. కానీ అవేమీ ఆమె పట్టించుకోలేదు. సిబ్బందిలో తానూ ఒకరిని అనుకుని ఎన్నికల సామగ్రిని గదుల్లోకి మోసి పలువురి మన్ననలను పొందారు.

వివరాల్లోకి వెళితే...కేరళ రాష్ట్రంలో మూడో పేజ్‌లో భాగంగా మంగళవారం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని బరువైన ట్రంకుపెట్టెల్లో ఉంచి ఓ లారీలో త్రిశ్శూర్‌ జిల్లా కేంద్రానికి ఎన్నికల సంఘం పంపింది. ఇక్కడ కలెక్టర్‌ టి.వి.అనుపమ. ఈ పెట్టెలను లారీ నుంచి దించి కలెక్టరేట్‌ లోని ఓ స్ట్రాంగ్‌రూంలోకి తరలించాల్సి ఉంది.

ఇద్దరు ఉద్యోగులు లారీలో ఉండి పెట్టెల్ని అందిస్తున్నారు. కొందరు కానిస్టేబుళ్లు, మరికొందరు సిబ్బంది వాటిని మోస్తున్నారు. ఓ సందర్భంలో పెట్టె అందించే సమయానికి అక్కడ ఒక్క కానిస్టేబులే ఉండడంతో రెండోవైపు తాను పట్టుకుని కలెక్టర్‌ టి.వి.అనుపమ పెట్టె మోసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కూడా దీన్ని కొనసాగించారు.

ఇలా మొత్తం పెట్టెలు దించి కార్యాలయంలో భద్రపరిచే వరకు ఆమె తన సాయం అందించి సిబ్బందిని ఆశ్చర్యపరచడమే కాదు, వారి అభినందనలు సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

Kerala
trissur collectrate
election meterial
collector anupama
  • Error fetching data: Network response was not ok

More Telugu News