Sri Lanka: భుజానికి బ్యాగ్.. చేతిలో ప్లేట్.. క్యూలో నిల్చుని బాంబు పేల్చిన ఉగ్రవాది!
- అల్పాహారం కోసం క్యూలో ఓపిగ్గా నిల్చున్న ఉగ్రవాది
- వ్యాపారం నిమిత్తం కొలంబో వచ్చానంటూ గదులు అద్దెకు
- అతడిచ్చిన అడ్రస్ నకిలీదని తేల్చిన పోలీసులు
భుజానికి బ్యాగ్ తగిలించుకుని వచ్చిన ఓ వ్యక్తి హోటల్‌లో టిఫిన్ కోసం చేతితో ప్లేట్ పట్టుకుని క్యూలో నిల్చున్నాడు. ముందు వెనకలకు చూశాడు. తాను సరిగ్గా క్యూ మధ్యలో ఉన్నానని, జనాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని నిర్ధారించుకున్నాడు. అంతే, ఒక్కసారిగా తన బ్యాగులో ఉన్న బాంబును పేల్చాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మాంసం ముద్దలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. శ్రీలంకలోని సినామాన్ హోటల్లో ఆదివారం ఉదయం జరిగిన ఘటన ఇది. ఉగ్రవాది ఓపిగ్గా క్యూలో నిల్చున్న వైనం సీసీకెమెరాకు చిక్కడంతో, ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉదయం 8:30 గంటలు అవుతోంది. వచ్చిపోయే వారితో హోటల్ రద్దీగా ఉంది. అక్కడున్నవారు టిఫిన్ కోసం చేతిలో ప్లేట్ పట్టుకుని క్యూలో నిల్చున్నారు. మహమ్మద్ అజాం మహమ్మద్ అనే వ్యక్తి కూడా ఆ క్యూలోకి వచ్చి చేరాడు. భుజానికి బరువైన బ్యాగ్ ఉంది. జనాలు పెద్ద సంఖ్యలో క్యూలో ఉండడంతో అదే సరైన సమయమని భావించిన అజాం బాంబు పేల్చాడు. అంతే.. ఉగ్రవాది సహా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ హోటల్ క్షణాల్లోనే మాంసం ముద్దలతో నిండిపోయింది. బాధితుల హాహాకారాలతో మార్మోగింది.
తాను ఆ దేశవాసినేనని అజాం చెప్పి హోటల్‌లోకి వచ్చినట్టు మేనేజర్ తెలిపాడు. తాను పెద్ద వ్యాపారినని పరిచయం చేసుకుని హోటల్ గదులు బుక్ చేసుకున్నాడని పేర్కొన్నాడు. వ్యాపారం నిమిత్తం కొలంబో వచ్చానని చెప్పిన అజాం గదుల బుకింగ్ కోసం ఇచ్చిన అడ్రస్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది.