Telangana: అధికారుల అంతర్గత తగాదాలతోనే ఇంటర్ ఫలితాలపై అపోహలు: మంత్రి జగదీశ్ రెడ్డి
- ఆ అపోహలు తొలగించేందుకు ఓ కమిటీ నియమించాం
- ముగ్గురు సభ్యులతో కమిటీ
- మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించా
అధికారుల అంతర్గత తగాదాలతోనే ఇంటర్ ఫలితాలపై అపోహలు సృష్టించబడ్డాయని, ఆ అపోహలను తొలగించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ మీడియట్ ఫలితాలు తప్పుడు తడకగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు.
అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షా ఫలితాలపై ఓ కమిటీని నియమించామని, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరితో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ కమిటీలో బిట్స్ పిలానీ నిపుణుడు ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ సభ్యులుగా ఉన్నారని వివరించారు. ప్రొఫెసర్ వాసన్ కు ఐటీపై స్పష్టమైన అవగాహన ఉందని, ప్రొఫెసర్ నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణుడని తెలిపారు. ఫలితాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించినట్టు సమాచారం.