Chandrababu: చూస్తుంటే ఇది బాలీవుడ్ సినిమాలా ఉందని ఎగతాళి చేస్తున్నారు: చంద్రబాబు
- మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ పై బాబు విమర్శలు
- ప్రధాని చెప్పేందాట్లో ఒక్కటన్నా నిజం ఉందా?
- 350 మందిని చంపాం అంటున్నారు, ఏ ఒక్క దేశమన్నా నిర్ధారించిందా?
ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ధ్వజమెత్తారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా శ్రీరామ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. "మోదీ పాలనలో ఉద్యోగాలు పోయాయి. నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. నిరుద్యోగం 6 శాతానికి ప్రబలింది. చరిత్రలో ఎప్పుడూలేదు. ఇది నేను చెబుతున్నది కాదు, ఎన్ఎస్ఎస్ఓ, కేంద్ర ప్రభుత్వం డేటానే చెబుతోంది.
అంతేకాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఓ రిపోర్ట్ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాలు పది భారత్ లోనే ఉన్నాయట. నరేంద్ర మోదీ గారూ, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పేదానికీ, చేసేదానికీ ఏమైనా పొంతన ఉందా? దేశాన్ని కాపాడుతామని, దేశం కోసమే బతుకుతున్నానని చెబుతారు, కానీ మోదీ పాలనలోనే సైనికులు ఎక్కువమంది ప్రాణాలు విడిచారు. 30 సంవత్సరాల్లో ఎన్నడూలేనంతగా జవాన్లు ప్రాణాలు కోల్పోయింది మోదీ హయాంలోనే.
అబద్ధాలు చెప్పడంలో మోదీని మించినవాళ్లు లేరు. ఈ విషయంలో ఆయనొక దిట్ట. పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో మోదీ అబద్ధాలకోరుతనం బట్టబయలైంది. సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని చెబితే అందరం సంతోషించాం. 350 మందిని చంపాం అంటున్నారు. ఈ విషయం ఏ ఒక్క దేశమైనా నిర్ధారించిందా? పాకిస్థాన్ కూడా అంగీకరించడంలేదు.
చూస్తుంటే ఇదో బాలీవుడ్ సినిమాలా ఉంది తప్ప ఎక్కడా జరిగిందిలేదు, కావాలనే గొప్పలు చెప్పుకుంటున్నారని అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇదే విషయం ప్రశ్నిస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీపై దాడులు చేయిస్తున్నారు. కానీ ఓ ప్రధాని వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. ఏం, మీ ఒక్కరికేనా ఉంది దేశభక్తి? ఇక్కడ వేదికపై ఉన్నవాళ్లకు, వేదిక దిగువన ఉన్నవాళ్లకు అందరికీ ఉంది దేశభక్తి! కానీ మీరు అబద్ధాలు చెబుతున్న తీరు మాత్రం అసభ్యంగా ఉంది" అంటూ నిప్పులు చెరిగారు.