USA: ఒంటిపై చర్మం లేకుండానే పుట్టిన చిన్నారి
- అమెరికాలో ఘటన
- తల, కాళ్లపైనే చర్మం
- కీలక భాగాలపై చర్మం ఏర్పడని వైనం
చర్మం మన శరీరానికి ఎంతో రక్షణ ఇస్తుంది. భౌతికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా చర్మం విశిష్టత అంతాఇంతా కాదు. మానవ దేహానికి చెందిన రోగనిరోధకశక్తికి తొలి కవచం చర్మమే. అయితే, అత్యంత బాధాకర పరిస్థితుల్లో ఓ చిన్నారి ఒంటిపై చర్మమే లేకుండా ఈ భూమిపైకి వచ్చింది. అమెరికాలో జరిగిందీ ఘటన.
శాన్ ఆంటోనియోలో నివసించే ప్రిస్కిల్లా మాల్డొనాడో అనే మహిళకు నెలలు నిండడంతో టెక్సాస్ లోని మెథడిస్ట్ హాస్పిటల్ లో జాయిన్ అయింది. అది ఆమెకు తొలి కాన్పు. మగబిడ్డ పుట్టిన ఆనందం ఆమెకు కాసేపే అయింది. ఆ చిన్నారి శరీరంపై అనేక కీలకభాగాలపై చర్మం లేకుండా ఉండడాన్ని వైద్యులు గమనించారు. కేవలం తల, కాళ్లపై మాత్రమే అక్కడక్కడా చర్మం కనిపిస్తోంది.
ఇది ఆటో ఇమ్యూన్ లోపం అని, వ్యాధినిరోధక శక్తికి సంబంధించిన సమస్య అని మెథడిస్ట్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు. ఈ విధమైన సమస్యతో వచ్చిన తొలి కేసు ఇదేనని, ఆ చిన్నారి బతకడం కష్టమేనని వైద్యులు చెప్పారు.
అబ్బాయి పుడితే జబారి అనే పేరు పెట్టుకోవాలని ప్రిస్కిల్లా ముందే నిర్ణయించుకుంది. కానీ, డాక్టర్లు చెప్పిన విషయంతో ఆమె తల్లిడిల్లిపోతోంది. అయితే, ఆమె భర్త మరో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి వైద్యులు చిన్నారికి శ్వాస సంబంధ ఇబ్బందులు లేకుండా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రయోగశాలలో కృత్రిమంగా చర్మాన్ని అభివృద్ధి చేసి దాన్ని చిన్నారి జబారికి అమర్చుతామని అక్కడి వైద్యులు భరోసా ఇవ్వడంతో ప్రిస్కిల్లా కుటుంబంలో కొత్త ఆశలు రేకెత్తాయి.