Visakhapatnam District: విశాఖలో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు

  • విమానంలో విశాఖ ఎంపీ హరిబాబు సహా పలువురు ప్రముఖులు
  • గాల్లోనే పది నిమిషాలు చక్కర్లు
  • వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు

హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వచ్చిన ఇండిగో విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఈ విమానంలో ఉన్న పలువురు ప్రముఖులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 6:45 గంటలకు విశాఖపట్టణం చేరుకుంది. అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన పైలట్ పదినిమిషాలపాటు అక్కడే చక్కర్లు కొట్టాడు. విమానం గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో కుదుపులకు గురైంది.

దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో తెలియక భయంతో వణికిపోయారు. విమానంలో విశాఖ ఎంపీ హరిబాబు, ఏపీసీసీఐఎఫ్‌ అధ్యక్షుడు సాంబశివరావు, వీడీసీ ఛైర్మన్ నరేశ్‌ కుమార్‌, సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ తదితరులున్నారు. అయితే, విమానం గాల్లో పది నిమిషాలపాటు చక్కర్లు కొట్టినా ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు మళ్లించారు. అనంతరం తిరిగి రాత్రి 9:30 తిరిగి హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం రాత్రి 10:30 గంటలకు విశాఖకు చేరుకుంది.

కాగా, చెన్నై నుంచి విశాఖకు వచ్చిన మరో విమానానికి కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో దానిని భువనేశ్వర్ మళ్లించారు. దీంతో విశాఖలో దిగాల్సిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ వచ్చిన విమానం ప్రయాణికులను విశాఖలో వదిలిపెట్టింది.

Visakhapatnam District
Indigo flight
Haribabu
BJP
Hyderabad
  • Loading...

More Telugu News